ఆర్సీబీ పై సన్ రైజర్స్ ఘన విజయం

May 23, 2026 12:14 AM
srh win against rcb

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51) అర్ధ సెంచరీలు బాదారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి (12 బంతుల్లో 29 నాటౌట్) రాణించాడు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అతను ఔటవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్లెం పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ (15), దేవదత్ పడిక్కల్ (21) కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. కెప్టెన్ రజత్ పటీదార్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్సర్), కృనాల్ పాండ్య (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లతో రాణించగా, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో లీగ్ దశను ముగించింది. మూడో స్థానంలో నిలవడంతో ఈ నెల 27న ముల్లన్ పూర్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media