జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉన్నా, కాంగ్రెస్ ఈ సారి గట్టి సవాల్ విసరడంతో సమరరంగం ఉత్కంఠభరితంగా మారింది.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహరచనను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కీలక నేతలతో సమావేశమై కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రత్యేకంగా చర్చించారు.
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టాలని ఆయన నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే మకాం వేసి, ప్రతి కదలికను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు అప్పగిస్తూ — “ఈ సారి పోటీ కఠినంగా ఉంటుంది, ప్రతి ఓటు కోసం పోరాడాలి” అని కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారు. వారిద్దరి నేతృత్వంలో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్, మైక్రో మేనేజ్మెంట్ స్థాయిలో ప్రచారం వేగవంతం అవుతోంది.
ఇక కాంగ్రెస్ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ హైకమాండ్ నేతల పర్యటనలు, స్థానిక నాయకుల సమన్వయంతో ఆ పార్టీ కూడా ప్రజల్లో ఉత్సాహం నింపుతోంది.
