ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2025 జరగనుంది. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి 100కి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా సదస్సు ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ తదితరులు హాజరవుతారు. నాలుగు రోజులపాటు విశాఖలోనే ఉండే సీఎం చంద్రబాబు, దేశ–విదేశీ పెట్టుబడిదారులతో భేటీ అవుతూ వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు.
సదస్సు సందర్భంగా పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ఒప్పందాల మార్పిడి కార్యక్రమాలు జరుగనున్నాయి. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఆటోమొబైల్స్, స్పేస్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరుగనున్న ఈ సదస్సు ద్వారా “ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్” అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.



