అంతర్జాతీయ జలాల్లో పొరపాటున సరిహద్దు దాటి బంగ్లాదేశ్ అధికారులకు చిక్కిన 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు స్వేచ్ఛ పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ (Bagerhat) జైలు నుంచి వీరు మంగళవారం (జనవరి 27, 2026) అధికారికంగా విడుదలయ్యారు. బంగ్లాదేశ్ హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్ మరియు భారత అసిస్టెంట్ హై కమిషనర్ (కుల్నా) చంద్రజిత్ సమక్షంలో విడుదల ప్రక్రియ పూర్తయింది. విడుదలైన వారిలో విజయనగరం జిల్లా (పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాలు) మరియు విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులు ఉండగా, మిగిలిన 14 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు.
ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మత్స్యకారుల విడుదల కోసం నిరంతరం కృషి చేశారు. జైలుకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడమే కాకుండా, చట్టపరమైన అడ్డంకులు తొలగేలా అధికారులతో సంప్రదింపులు జరిపారు. జైలు నుంచి విడుదలైన వీరిని ప్రస్తుతం మోంగ్లా (Mongla) పోర్టుకు తరలించారు. సీజ్ చేసిన బోట్లకు మరమ్మతులు పూర్తి చేసి, ఈ నెల 29న అంతర్జాతీయ జలాల్లో భారత కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించనున్నారు. మరో 4-5 రోజుల్లో వీరు తమ స్వగ్రామాలకు చేరుకోనున్నారు.మూడు నెలల తర్వాత తమ వారు ఇంటికి వస్తుండటంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనంద నిలయమైంది. ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడిన మత్స్యకారులు భావోద్వేగానికి గురయ్యారు.
