అన్నీ అబద్ధాలే.. అంతా మోసం: చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు!

February 10, 2026 5:18 PM

అమరావతి (బీఎన్ఎస్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలన్నీ వట్టి ‘వ్యాపార ప్రకటనలు’ (హైప్) మాత్రమేనని, వాస్తవ పనితీరు మాత్రం అత్యంత దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. “22వ ర్యాంక్ విజన్: ప్రచారంలో టాప్.. పనితీరులో పాతాళం” అంటూ ఎద్దేవా చేశారు.

అంకెలను వండేశారు: జగన్ ఆరోపణ
రాష్ట్ర ఆదాయం పడిపోతున్న సమయంలో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం జిఎస్‌డిపి (GSDP) గణాంకాలను వండి వార్చిందని జగన్ ఆరోపించారు. “2024-25లో రాష్ట్ర వృద్ధి రేటు 11.75 శాతమని, 2025-26లో 10.75 శాతమని ప్రభుత్వం చెబుతోంది. జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వేగంగా దూసుకుపోతోందని కలరింగ్ ఇస్తోంది. ఇవి ఏ స్వతంత్ర సంస్థ ఇచ్చినవి కావు, సాక్షాత్తూ చంద్రబాబు కార్యాలయంలో తయారైన అంకెల గారడీ” అని ఆయన దుయ్యబట్టారు.

22వ స్థానంలో ఏపీ.. ప్రపంచ ఆర్థికవేత్తలకే అంతుచిక్కని వింత!
ప్రభుత్వ లెక్కల్లో చూపిన విధంగా వృద్ధి రేటు 11.09 శాతం ఉంటే, మరి ప్రభుత్వ పన్ను ఆదాయం ఎందుకు పెరగలేదని జగన్ ప్రశ్నించారు. కాగ్ (CAG) విడుదల చేసిన తొలి 9 నెలల గణాంకాల ప్రకారం.. పన్ను ఆదాయం వృద్ధి కేవలం 1.97 శాతానికే పరిమితమైందని ఆయన ఎత్తిచూపారు. “వృద్ధి రేటు 11 శాతానికి పైగా ఉండి, ఆదాయ వృద్ధి మాత్రం 2 శాతం లోపు ఉండటం అనేది ప్రపంచంలోని ఏ ఆర్థికవేత్తకూ అర్థం కాని వింత. ఇది కేవలం బాబుగారి ‘విజనరీ’ నాయకత్వంలోనే సాధ్యం” అని ఎద్దేవా చేశారు.

అప్పుల్లో నంబర్ వన్.. అభివృద్ధిలో లాస్ట్
కాగ్ లెక్కల ప్రకారం దేశంలోని 23 రాష్ట్రాల జాబితాను పరిశీలిస్తే, పన్ను ఆదాయం పెరగడంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో (దిగువ నుండి రెండోది) ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పన్ను ఆదాయం 9.64 శాతం పెరిగితే, ఏపీలో మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ ఏదైనా అంశంలో నంబర్ వన్ స్థానంలో ఉందంటే.. అది కేవలం అప్పులు, అవినీతి, రాజకీయ వేధింపులు మరియు అసత్య ప్రచారాల్లో మాత్రమేనని జగన్ తన ట్వీట్‌లో ఘాటుగా పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media