గత కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలతో వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లో నిలిచారు. సస్పెన్షన్ తర్వాత మొదటిసారిగా కౌన్సిల్ సమావేశాలకు హాజరైన ఆయన, అసెంబ్లీ లాబీల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. జగన్ పక్కన కూర్చున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇద్దరి మధ్య పలకరింపులు, నవ్వులు కొనసాగాయి.
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత దువ్వాడ సభకు రావడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో జగన్తో ఆయన మాటా మంతి కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సస్పెన్షన్ వేటు పడినప్పటికీ జగన్ ఆయనను సాదరంగా పలకరించడం చూస్తుంటే, పార్టీలో ఆయన పునరాగమనంపై లేదా భవిష్యత్ రాజకీయాలపై చర్చ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టిన దువ్వాడ, నేడు జగన్ను కలవడం ద్వారా తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేశారని సన్నిహితులు పేర్కొంటున్నారు.
