AP:శ్రీకాకుళంలో వైభవంగా కృష్ణదేవరాయ ఉత్సవాలు

February 12, 2026 12:12 PM

సాహిత్య సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వైభవాన్ని స్మరిస్తూ కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో నిర్వహించిన ఉత్సవాలు కళాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో హైలైట్‌గా నిలిచింది “సిరికాకొలను చిన్నది” నృత్య రూపకం. 1969లో దివంగత ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన ఈ అపురూప కావ్యాన్ని, ప్రముఖ నాట్యకారిణి స్మితా మాధవ్ తన బృందంతో కలిసి రసరమ్యంగా ప్రదర్శించారు. రాయల కాలం నాటి దేవదాసి అలివేణి (స్మితా మాధవ్) వ్యధాభరిత గాథ ఇది. శ్రీకాకుళేంద్రుడిని భర్తగా భావించి సేవ చేసే అలివేణిని, కపట బుద్ధి గల మార్తాండ శర్మ మోసం చేయడం.. చివరకు న్యాయం జరగడం ఈ రూపకంలోని ఇతివృత్తం.

రాయలవారు శ్రీకాకుళేశ్వర స్వామి సన్నిధిలో ‘ఆముక్తమాల్యద’ గ్రంథ రచన చేసిన చారిత్రక ఘట్టాలను, నాటి సామాజిక పరిస్థితులను ఈ నాటిక కళ్లకు కట్టింది.స్మితా మాధవ్ శిష్య బృందం (వర్ణ ఆర్ట్స్ అకాడమీ) అభినయం, సంగీత మాధుర్యం ప్రేక్షకులను విజయనగర సామ్రాజ్య కాలానికి తీసుకువెళ్లాయి.ప్రదర్శన అనంతరం జస్టిస్ యూవీ దుర్గాప్రసాద్, మండలి బుద్ధప్రసాద్ తదితర ప్రముఖులు కళాకారులను ఘనంగా సత్కరించారు. వేటూరి సుందరరామమూర్తి గారు రాసిన ఈ అద్వితీయ రచనను నేటి తరానికి అందించిన స్మితా మాధవ్ బృందాన్ని సభ్యులు అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media