రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వైఎస్ఆర్ సీపి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
మైనర్ బాలికపై జరిగిన దారుణం తనను కలిచివేసిందని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయిందని పూజిత ఆరోపించారు. మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధితులకు అండగా నిలిచిన తన తండ్రి (కాకాణి గోవర్ధన్ రెడ్డి) పై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పిన చంద్రబాబు, నేడు కూటమి నాయకుల అండతోనే గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయని, వాటివల్లే మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ సీపి నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపి నాయకురాళ్లు మొయిళ గౌరీ, లక్ష్మీ సునంద తదితరులు పాల్గొన్నారు.
