విద్యుత్ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నూతన నియామకాలు చేపట్టనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండర్ను ఎమ్మెల్యే కూన రవికుమార్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
విద్యుత్ వినియోగదారులలో సంతృప్తి స్థాయిని పెంచేలా ఉద్యోగులు జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని మంత్రి సూచించారు.ఉద్యోగులు కోరిన డిమాండ్లలో ఇప్పటికే 90 శాతం పరిష్కరించామని, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, దేశంలోనే తొలిసారిగా ట్రూ అప్ ఛార్జీలను ‘ట్రూ డౌన్’ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా సొంత వనరులతో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణలకు చంద్రబాబే ఆద్యుడని, టీడీపీ ఎప్పుడూ బీసీల వెంటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పోలాకీ శ్రీనివాసరావు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు.
