వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు.కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ. 26 వేలకు పెంచాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి కనీస పెన్షన్ రూ. 9 వేలుగా నిర్ణయించాలని కోరారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని, సొంత గనులు కేటాయించి ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని నినదించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గిగ్ వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు సెక్షన్ 30 అమలులో ఉన్నట్లు ముందే ప్రకటించడంతో పలుచోట్ల శాంతియుత ర్యాలీలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కార్మికులు ఖాళీ ప్లేట్లతో రోడ్డుపై బైఠాయించి వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర, విద్యుత్ సవరణ చట్టం రద్దు వంటి అంశాలను కూడా నాయకులు ప్రస్తావించారు.

