సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడినే తమ ఉచ్చులోకి లాగి లక్షలాది రూపాయలు కాజేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మగటపల్లికి చెందిన ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ ఈ మోసానికి గురయ్యారు.

కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ. 10 లక్షల విలువైన ఎరువులు పంపిస్తామని, వాటిని విక్రయిస్తే రూ. 5 లక్షల లాభం వస్తుందని సైబర్ నేరగాళ్లు శ్రీనివాస్ ఫేస్‌బుక్ మెసేంజర్ కు లింక్ పంపారు. ఆ లింక్ ఓపెన్ చేసిన శ్రీనివాస్ కు ఫోన్ చేసిన నేరగాళ్లు.. సరుకు లారీలో వస్తోందని, దానికి సంబంధించి వివిధ ఛార్జీల కింద డబ్బులు కట్టాలని నమ్మించారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాస్ దఫదఫాలుగా రూ. 24 లక్షలను ఫోన్ పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. మరింత డబ్బు అడగడంతో అనుమానం వచ్చిన ఆయన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేసే సమయానికే నేరగాళ్లు రూ. 15 లక్షలు డ్రా చేసుకున్నారు. అయితే, పోలీసుల సకాలంలో స్పందించడంతో మిగిలిన రూ. 9 లక్షలను బ్యాంక్ అధికారుల సహకారంతో ఫ్రీజ్ చేయగలిగారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపవద్దని సీఐ భీమరాజు ప్రజలను హెచ్చరించారు.
