తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టీటీడీ ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానించి, దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ‘వేదాశీర్వచనం’ అందజేశారు. ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను భట్టి విక్రమార్కకు అందజేసి గౌరవించారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
