ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయని, సాక్షాత్తూ ఒక న్యాయవాదికే రక్షణ లేని పరిస్థితి దాపురించిందని జడ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, ఆయన అరెస్టుపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు.
“అనని మాటలకు నాపై 53 కేసులు పెట్టారు. ఒక న్యాయవాదికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా?” అని జడ శ్రవణ్ ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటిపై ఒక మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాడులు జరిగితే, హోం మంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదని, ‘బ్లూ బుక్’ వచ్చే రోజు వస్తుందని హెచ్చరించారు. అంబటి రాంబాబుపై నేరుగా మర్డర్ అటెంప్ట్ జరిగిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో డిఫెన్స్‌లో పడ్డ ప్రభుత్వం, ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అరాచకాలు సృష్టిస్తున్న వారు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఏ దేశానికి పారిపోతారో చూసుకోవాలని భరత్ వ్యాఖ్యానించారు.
