జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టులైన సోమశిల, కండలేరు జలాశయాలకు సంబంధించిన భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
పడమటి నాయుడు పల్లి నుండి పొంగూరు వరకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రిజర్వాయర్ పనులకు అటవీ శాఖ అనుమతులు అవసరమైన చోట, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి తగిన క్లియరెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ మరియు అటవీ శాఖ అనుమతుల నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, పనుల్లో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, సోమశిల జలాశయ ఎస్.ఈ. వి.ఆర్.రెడ్డి, కండలేరు జలాశయ అధికారులు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
