ఇంద్రకీలాద్రిపై గత ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు పర్వంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు కృష్ణానదిలో శాస్త్రోక్తంగా ‘చక్రస్నానం’ నిర్వహించారు.

ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను, ఆయుధాలను పల్లకిలో ఉంచి మేళతాళాల నడుమ కృష్ణానది దుర్గా ఘాట్‌కు శోభాయాత్రగా తీసుకెళ్లారు. దుర్గా ఘాట్ వద్ద అర్చకులు వేదమంత్రాల మధ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అనంతరం కృష్ణానది పుణ్యజలాల్లో చక్రస్నానం చేయించారు. శివయ్య చక్రస్నాన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారితో పాటు భక్తులు కూడా నదిలో స్నానమాచరించి పునీతులయ్యారు. చక్రస్నానం అనంతరం సాయంత్రం ఆలయంలో ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగిశాయి.
