మత్స్యకారుల ఆరాధ్యదైవం, విశ్వాసానికి ప్రతిరూపమైన నూక తాత జాతర రాజయ్యపేటలో అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి అనంతరం నిర్వహించే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

నూక తాత ఆశీస్సులు ఉంటే కష్టాలు తొలగిపోతాయనే నమ్మకంతో, భక్తులు తమ భక్తి పరాకాష్టను ప్రదర్శిస్తూ రహదారిపై పడుకుని స్వామివారి పాదస్పర్శ పొందారు. గ్రామంలోని వీధులన్నీ భక్తుల నినాదాలతో మారుమోగగా, రాజయ్యపేట ఒక పుణ్యక్షేత్రాన్ని తలపించింది. గ్రామ పెద్దలు, యువత స్వచ్ఛందంగా భక్తులకు సేవలందించగా, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో జాతర ప్రశాంతంగా ముగిసింది.

