YSRCP పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజలు మళ్లీ ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పొదలకూరు మండలం విరువూరు, నేదురుమల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
యూరియా కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నామని రైతులు కాకాణి ఎదుట వాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేవలం మొక్కుబడిగా తెరిచారని ఆయన విమర్శించారు. జగన్ హయాంలో ప్రతి ఏటా కొత్త పెన్షన్లు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులకు మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు. కిడ్నీ బాధితులకు ఇచ్చే రూ.10 వేల పెన్షనే తనను బతికించిందని విరువూరు వాసి వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. అభివృద్ధిని గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ఆయన తీరును అసహ్యించుకుంటున్నారని కాకాణి ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
