టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము ఎలాంటి చర్చకైనా సిద్ధమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో సరఫరా అయినది అసలు నెయ్యి కాదని, అది కేవలం రసాయనాల మిశ్రమమని సిట్ (SIT) నివేదికలో తేలిందని వెల్లడించారు.

వైసీపీ సభ్యులు సాక్షి పేపర్లో వచ్చే కథనాలను పట్టుకుని సభ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో ‘పింక్ డైమండ్’ పేరుతో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు నెయ్యి విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సేకరణ సామర్థ్యం లేని సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి స్వామివారి పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. “దేనితోనైనా ఆడుకోండి.. కానీ వేంకటేశ్వరస్వామితో ఆటలాడొద్దు” అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. దేవాలయాలకు నెయ్యి సరఫరా చేయకూడదనే నిబంధనను ఆ సంస్థ మొదటి నుంచీ పాటిస్తోందని ఆమె వివరించారు.
