ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత బుధవారం పరిశీలించారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచి, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఆప్కో ఆధ్వర్యంలో అసెంబ్లీ ఆవరణలో 12 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇవి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (మార్చి 7 వరకు) అందుబాటులో ఉంటాయి.
పొందూరు షర్ట్లు, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, ధర్మవరం పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులు, బెడ్ షీట్లు విక్రయానికి ఉంచారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వంటి ప్రముఖులు చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలతో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలందరూ వారంలో కనీసం ఒకరోజు చేనేత దుస్తులు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.
