ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం త్వరలోనే మరో డీఎస్సీ (DSC) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కర్నూలు వంటి ప్రాంతాల్లో టీచర్-స్టూడెంట్ రేషియో తక్కువగా ఉందని, దానిని త్వరలోనే సరిచేస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న డేటా ఆపరేటర్లు, ఉపాధ్యాయులకు దేశంలోనే అత్యధిక జీతాలు ఏపీలోనే ఇస్తున్నామని, జీతాల పెంపుపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలిపారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కర్నూలు రీజియన్‌లోని విద్యాసంస్థల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని, రాయలసీమలో సీజనల్ హాస్టళ్ల సంఖ్యను పెంచుతామని వివరించారు. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ‘క్లస్టర్ బేస్డ్ అప్రోచ్’తో కొత్త ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
