వైఎస్ఆర్ కడప జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేరాలకు పాల్పడే వారు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిశిత నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లను అరికట్టాలని ఆదేశించారు. హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌లపై ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, వాణిజ్య సంస్థల్లో విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, పీజీఆర్ఎస్ (P.G.R.S) ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
