ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకులు లింగంబట్ల దుర్గాప్రసాద్ దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. మంత్రాలయ రాఘవేంద్ర మఠ పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజీ వారిని ఘనంగా సత్కరించారు.
పురాతన కాలం నుండి అమ్మవారిని అర్చించే అర్చకుల పరంపరలో దుర్గాప్రసాద్ ఏడవ తరం వారిగా విశేష సేవలు అందిస్తున్నారు. వైదిక ఆచారాల ప్రకారం దసరా, భవాని దీక్షలు, పవిత్రోత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.వైదిక పరీక్షల ద్వారా అర్చకుల ఎంపికే కాకుండా, స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వారికి కూడా దుర్గాప్రసాద్ శిక్షణ ఇస్తుంటారు.ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రాలయ మఠాధిపతి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, అమ్మవారి కైంకర్యాల్లో మరింత భక్తితో సేవలు అందిస్తానని తెలిపారు.
