YSR కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలు తమకు జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. నిర్వాసితుల కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ప్రధాన గేటును ముట్టడించి నిరసన తెలిపారు.

ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో భూనిర్వాసితులకు ఇచ్చిన హామీలను యాజమాన్యం తుంగలో తొక్కిందని బాధితులు ఆరోపించారు.ఇప్పటికే ఉద్యోగాలు పొందిన స్థానికులకు ఇస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని, కనీస వేతనాలు కూడా పెంచడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం మరియు ఉన్నతాధికారులు నేరుగా వచ్చి చర్చలు జరిపేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్యాక్టరీ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
