ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.

వాకాడులోని నేదురుమల్లి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యానగర్లోని ఎన్బీకేఆర్ కళాభవన్ లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రాంకుమార్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని రక్తదానం చేశారు. “నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకు కంటే, ఒక టీచర్ కొడుకు అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను” అని రాంకుమార్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యానగర్ను పూర్తిస్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే తన తండ్రి ఆశయమని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ కల నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు లక్ష్మీ నారాయణరెడ్డి, పార్టీ కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు.
