ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో హోంశాఖ బడ్జెట్ డిమాండ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె కీలక ప్రసంగం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు 6 శాతం, మహిళలపై దాడులు 4.4 శాతం తగ్గాయని మంత్రి గణాంకాలతో వివరించారు.చట్టబద్ధత లేని ‘దిశ’ యాప్‌తో గత ప్రభుత్వం మోసం చేసిందని.. తాము ‘శక్తి యాప్’, ‘శక్తి టీమ్స్’ ద్వారా మహిళలకు అసలైన భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలు బాగుండటం వల్లే ఏపీ నేడు దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. “రప్పా రప్పా” అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని, తప్పు చేస్తే ఎవరైనా సరే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని మంత్రి హెచ్చరించారు.
