ప్రముఖ విద్యాసంస్థల అధినేత్రి, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు ఆమె భర్త బుట్టా నీలకంఠంలకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారీ షాక్ ఇచ్చింది. తాము ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించని కారణంగా వారి ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.

2018లో బుట్టా దంపతులు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుండి రూ. 340 కోట్ల రుణం తీసుకున్నారు. వడ్డీతో కలిపి ప్రస్తుతం ఆ బకాయిలు రూ. 782.07 కోట్లకు చేరుకున్నాయి. పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ రుణం చెల్లించకపోవడంతో, తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేసి రికవరీ చేయాలని ఎల్‌ఐసీ నిర్ణయించింది. బుట్టా గ్రూప్ ఆఫ్ కంపెనీల పేరిట ఉన్న స్థిరాస్తులు ఈ వేలం పరిధిలోకి రానున్నాయి. ఈ వార్త ప్రస్తుతం రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
