రాజమండ్రిలో కల్తీ పాల కలకలం ఇద్దరు మృతి, 14 మందికి కిడ్నీ వ్యాధి గోదావరి తీరాన కల్తీ పాలు ప్రాణసంకటంగా మారాయి. రాజమండ్రిలోని చాడేశ్వరి నగర్, లాలాచెరువు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన వారిలో ఒకేసారి 14 మంది అస్వస్థతకు గురవ్వడం, ఇద్దరు మృతి చెందడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.

ఏం జరిగింది?
ఈ నెల 15వ తేదీ నుంచి స్థానికుల్లో వాంతులు, పొట్ట ఉబ్బడం, మూత్రవిసర్జన కాకపోవడం (అనూరియా) వంటి లక్షణాలు కనిపించాయి. బాధితుల్లో 5 నెలల శిశువు నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు.భాగిశెట్టి కనకరత్నం, తాడి కృష్ణవేణి చికిత్స పొందుతూ మరణించారు.బాధితులందరికీ కోరుకొండకు చెందిన గణేష్ అనే వ్యక్తి పాలు పోస్తున్నట్లు గుర్తించారు. పాలలో చిక్కదనం కోసం యూరియా కలపడం వల్లే కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.ఘటనపై ఎంపీ పురందేశ్వరి, హెల్త్ కమిషనర్ వీరపాండియన్ స్పందించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అధికారులు పాల నమూనాలను సేకరించి హైదరాబాద్, విశాఖ ల్యాబ్‌లకు పంపారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
