కృష్ణా నదిపై సాగుతున్న పడవ ప్రయాణం ఇప్పుడు ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల నుంచి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాలకు వెళ్లేందుకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ పడవలే ఆధారంగా చేసుకుంటున్నారు. అయితే, పడవ యజమానుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే స్థితి నెలకొంది.
పడవలకు లైఫ్ జాకెట్లు తగిలించి ఉంచుతున్నారే తప్ప, ప్రయాణికులతో ధరింపజేయడం లేదు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని నదిలో ప్రయాణిస్తుండటంతో పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
పడవల్లో కనీస భద్రతా పరికరాలైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తాడు, టార్చ్ లైట్, విజిల్ వంటివి ఎక్కడా కనిపించడం లేదు. బోటు నడిపే వారికి సరైన లైసెన్సులు ఉన్నాయా? అసలు బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.గతంలో ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 32 మంది మరణించినా, అధికారులు నేటికీ పాఠాలు నేర్చుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు ఇప్పటికైనా స్పందించి, అక్రమ పడవ ప్రయాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
