‘వైద్యం మీ చెంతకే’ అని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలని నిరూపించే ఘటన ఒకటి అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది. అస్వస్థతకు గురైన భార్యను ఆసుపత్రికి చేర్చేందుకు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో, ఒక భర్త తన భార్యను ఎడ్లబండిపైనే 18 కిలోమీటర్లు తీసుకువచ్చిన వైనం స్థానికులను కలచివేసింది.
అసలేం జరిగింది?
పుంగనూరు మండలం మేళ్లదొడ్డికి చెందిన నారాయణమ్మ అనే మహిళ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. కంగారుపడిన భర్త రామయ్య వెంటనే 108కు ఫోన్ చేశాడు. అయితే, తాము దూరంగా ఉన్నామని, ఇప్పుడు రాలేమని సిబ్బంది నుంచి సమాధానం రావడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. సమయం మించిపోతుండటంతో, తన వద్ద ఉన్న ఎడ్లబండినే అంబులెన్స్‌గా మార్చుకుని భార్యను ఆసుపత్రికి తరలించాడు.ప్రస్తుతం నారాయణమ్మకు ప్రభుత్వ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన 108 సేవలు విఫలం కావడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
