జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పట్ల కూటమి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోంది. అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ‘జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు’ను ఆమె ప్రవేశపెట్టారు.

ఖైదీలలో మానసిక పరివర్తన కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఖైదీలు చదువుకునేందుకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, వ్యవసాయం మరియు ఇతర వృత్తుల్లో శిక్షణ ఇస్తామన్నారు. జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఖైదీల నేరచరిత్ర, జైలులో వారి ప్రవర్తన ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించి సంస్కరణలు అమలు చేస్తారు.ఖైదీలను కేవలం నేరస్తులుగానే చూడకుండా, వారిలో మార్పు తీసుకువచ్చి తిరిగి సమాజంలో కలిసేలా చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి అనిత వివరించారు.
