గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎర్రన్నాయుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని, నేటికీ తాను ఎవరిని కలిసినా తన తండ్రి జ్ఞాపకాలను ముందుగా గుర్తు చేసుకోవడం గర్వంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం ఎర్రన్నాయుడు 69వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

నిమ్మాడలోని ఎర్రన్న ఘాట్‌తో పాటు శ్రీకాకుళం నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న ఎర్రన్నాయుడు విగ్రహాలకు రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘జోహార్ ఎర్రన్న’ నినాదాలతో సిక్కోలు మారుమ్రోగింది.జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలన్న ఎర్రన్నాయుడి కల సాకారం చేసేందుకు కృషి చేస్తున్నానని, కూటమి హయాంలోనే నేరేడి బ్యారేజీ ప్రారంభోత్సవం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడమే తండ్రి ఆశయమని, కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ ద్వారా శ్రీకాకుళం జిల్లా మొదటి లబ్ధిదారుగా మారుతుందని తెలిపారు. పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గూగుల్ వంటి సంస్థలు ఏపీకి రావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లే సాధ్యమైందని కొనియాడారు.
