మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్, CJNG అధినేత ‘ఎల్ మెంచో’ సైనిక ఆపరేషన్‌లో గాయపడి మరణించడంతో ఆ దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. అవకాడో రైతు నుంచి అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్‌గా ఎదిగిన ఇతడు, గతంలో మిలిటరీ హెలికాప్టర్‌నే కూల్చివేసి ప్రపంచాన్ని వణికించాడు.

మెంచో మరణ వార్త బయటకు రావడంతో అతని అనుచరులు ఆగ్రహంతో బస్సులు, పెట్రోల్ బంకులను తగులబెడుతూ ‘నార్కో బ్లాకేడ్స్’తో నగరాలను దిగ్బంధిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇతని గుప్పిట్లో ఉన్న కార్టెల్ ఇప్పుడు విచ్ఛిన్నమై, ప్రాంతీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే తరుణంలో ప్రత్యర్థి ‘సినలోవా కార్టెల్’ డ్రగ్ మార్గాలను చేజిక్కించుకోవడానికి భారీ దాడులకు దిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిణామాలు మెక్సికోలో ముఠా యుద్ధాలకు మరియు తీవ్ర రక్తపాతానికి దారితీస్తాయని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
