ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు శాసనసభ పనితీరుపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అసెంబ్లీని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు అసెంబ్లీకి వచ్చిన విద్యార్థులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను మరియు సభా మర్యాదలను ఆసక్తిగా గమనించారు. విద్యార్థులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సభలో జరిగే చర్చలను, అంశాలను క్షుణంగా పరిశీలించాలని, వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేవలం సూచనలకే పరిమితం కాకుండా, వారితో సరదాగా ముచ్చటించిన పవన్ కళ్యాణ్, అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలపై ఎలా చర్చిస్తారో ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగడం పట్ల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
