జిల్లా యువతను ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రూపొందించిన “స్టార్టప్ కడప” ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం జేసీ డా. నిధి మీనాతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.

ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో (P4) ఇన్నోవేటివ్‌గా నిర్మిస్తున్న ఈ సెంటర్, కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా మార్చనుంది. యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న తరహా వ్యాపారులకు ఇది ఒక గొప్ప విజ్ఞాన, ఉపాధి వనరుగా ఉపయోగపడుతుంది. కడప ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చే దిశగా, ప్రతి ఇంటి నుండి ఒక స్టార్టప్ రావాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది పునాది వేయనుంది.ఈ కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
