TDP గ్రీవెన్స్ లో భూ కబ్జాలు, వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై అర్జీలు

February 24, 2026 5:51 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విన్నపాల స్వీకరణ కార్యక్రమంలో మంగళవారం పలు జిల్లాల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ముస్తాక్ అహ్మద్, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

నంద్యాల జిల్లా పార్నపల్లె గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ భాష, నూర్జహాన్ తమ పూర్వీకుల భూమిని కొందరు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని, రికార్డుల్లో భూమి మాయం చేశారని ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన విజయకుమారి విన్నపిస్తూ.. రూ. 70 వేల అప్పుకు ఇప్పటికే రూ. 3 లక్షలు చెల్లించినా, వడ్డీ వ్యాపారి ఇంకా వేధిస్తున్నాడని, ఇంటి పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లాకు చెందిన ముత్యాలమ్మ తన తల్లి పేరిట ఉన్న 7.60 ఎకరాల భూమికి సర్వే పూర్తయినా అధికారులు సర్టిఫికేట్ ఇవ్వడం లేదని, స్థానిక మధ్యవర్తుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు పట్టా మార్పిడి చేయడం లేదని మొరపెట్టుకున్నారు.మాచర్ల మండలం కంభంపాడుకు చెందిన ఏసుదాసు.. తనను పోషిస్తుందని నమ్మి కోడలికి భూమి రాసిస్తే, ఆమె తనను పట్టించుకోవడం లేదని, తన భూమి తనకు ఇప్పించాలని కోరారు.
ఎర్రగుంట్ల, పశర్లపాడు గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, అక్రమంగా జారీ చేసిన టైటిల్ డీడ్లను రద్దు చేయాలని కోరారు.వీటితో పాటు పెన్షన్, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాలు మరియు అనారోగ్య సహాయం కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు. బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media