విద్యార్థుల భవిష్యత్తు కోసం తపించే ‘బడి బాంధవుల’కు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు పి.వి.వి. సత్యనారాయణ చేస్తున్న సేవలను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.

సత్యనారాయణ మాస్టారు తన సొంత నిధులు రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో దాతల నుంచి సేకరించిన మరో రూ. 1.80 లక్షలతో పాఠశాల రూపురేఖలు మార్చేశారు.

క్లాస్ రూమ్‌లలో టైల్స్, గ్రౌండ్ ఫ్లోరింగ్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్, కాంపౌండ్ వాల్‌తో పాఠశాలను కొత్తగా తీర్చిదిద్దారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా 4 కంప్యూటర్లతో డిజిటల్ క్లాస్ రూమ్, పిల్లల కోసం కిచెన్ గార్డెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగా వచ్చే విద్యా సంవత్సరానికి ఏకంగా 64 మంది విద్యార్థులు కొత్తగా ఈ పాఠశాలలో చేరడం విశేషం.ఉపాధ్యాయుడి నిబద్ధతను, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారాన్ని అభినందిస్తూ.. ఇలాంటి వారే సమాజానికి స్ఫూర్తిదాయకమని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

