ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై వీటిని ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గురువారం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు.

స్వర్ణ గ్రామం కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక యువతలోని నైపుణ్యాలను గుర్తించి, వారికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) మరియు ఇతర జీవనోపాధి అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యాలయాల స్టేషనరీ, ఇంటర్నెట్ ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 1,000 చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలోని లోపాలను సరిదిద్ది, వ్యవస్థను పటిష్టం చేసేందుకు మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు.స్వర్ణాంధ్ర సాధనలో ఈ ‘స్వర్ణ గ్రామం’ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
