జలవనరుల శాఖలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి BJP నేత

February 26, 2026 5:09 PM

రాష్ట్రంలోని జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న లస్కర్లు, ఫిట్టర్లు, గేట్ మరియు పంప్ ఆపరేటర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర నమామి గంగే కన్వీనర్ మిడతల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయ అధికారి చలపతికి ఆయన వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో సుమారు 7,227 లస్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఇతర ఆపరేటర్ పోస్టులతో కలిపి పదివేలకు పైగా ఖాళీలు ఉన్నాయని రమేష్ పేర్కొన్నారు. అవుట్‌సోర్సింగ్ విధానం వల్ల ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయని, దీనివల్ల గేట్లు కొట్టుకుపోవడం, షట్టర్లు ఊడిపోవడం వంటి ఘటనలు జరిగి వ్యవసాయ రంగానికి వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 98 ప్రకారం ప్రాజెక్టుల ముంపునకు గురైన కుటుంబాల్లోని నిరుద్యోగులకు ‘ఇంటికొక ఉద్యోగం’ ఇవ్వాలన్న హామీని నెరవేర్చాలని కోరారు.
గతంలో లాగే లస్కర్లను, ఆపరేటర్లను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి ప్రాజెక్టుల భద్రతను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media