కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. గురువారం నిర్వహించిన హుండీల లెక్కింపులో కేవలం 35 రోజుల కాలానికి గాను రూ. 2,17,83,358 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా రూ. 1,58,00,536, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 59,82,822 నగదు లభించింది. భక్తులు సమర్పించిన కానుకల్లో 42.400 గ్రాముల బంగారం, 1.280 కిలోల వెండి ఉన్నాయి. 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో లభించాయి.

ఈ సందర్భంగా ఆలయ ఈవో & డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ఆదాయం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పలువురు ఆలయ ధర్మకర్తలు, బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
