విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో త్వరలో జరగనున్న అత్యంత పవిత్రమైన ‘మహాకుంభాభిషేక’ మహోత్సవానికి సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆలయ అధికారులు కంచి పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఈవో వి.కె. శీనా నాయక్ నేడు కంచిలో జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని కలిశారు. మహాస్వామి వారికి పాదాభివందనం చేసి, మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రికను అందజేశారు.అమ్మవారి ఆశీస్సులతో నిర్వహించ తలపెట్టిన ఈ మహాక్రతువుకు విచ్చేసి భక్తులను ఆశీర్వదించాలని మహాస్వామి వారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను ఆలయ మర్యాదలతో అందజేశారు.త్వరలోనే ఈ కుంభాభిషేక తేదీలను అధికారికంగా వెల్లడించి, ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

