అనకాపల్లి జిల్లాలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ‘సైకో కిల్లర్’ పిచ్చేటి ఉపేంద్ర బాబు (30) దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం రాత్రి మాడుగుల మండలం జంపిన గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని వేటకొడవళ్లతో నరికి చంపారు.

ఉపేంద్ర బాబుపై మొత్తం ఐదు హత్య కేసులు, పలు దొంగతనం కేసులు ఉన్నాయి. వడ్డాది మాడుగుల స్టేషన్ పరిధిలో రెండు, మునగపాకలో ఒకటి, నర్సీపట్నంలో రెండు హత్య కేసులు ఇతనిపై నమోదయ్యాయి.ఇటీవల విజయనగరం జిల్లా వేపాడ మండలంలో జరిగిన ఒక దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన ఉపేంద్ర బాబు, కొద్దిరోజుల క్రితమే బెయిల్పై బయటకు వచ్చాడు.ఈ హత్యపై సీఐ కృష్ణ స్పందిస్తూ.. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో పలు కోణాల్లో విచారణ జరుపుతున్నామని, కొంతమంది అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. జంపిన గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
