ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, కొలీజియం ఈ ముందస్తు నిర్ణయం తీసుకుంది.
హైకోర్టుల్లో పరిపాలనా సౌలభ్యం కోసం నూతన సీజేలను రెండు నెలల ముందే బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొత్త పాలసీలో భాగంగా ఈ సిఫారసు జరిగింది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్ – హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె ముందుగా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యి, ఏప్రిల్ 25న సీజేగా బాధ్యతలు చేపడతారు. 1964లో జన్మించిన లీసా గిల్, పంజాబ్ యూనివర్సిటీ నుంచి LL.B, LL.M పూర్తి చేశారు. 1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టి, 2014లో పంజాబ్ – హర్యానా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.జస్టిస్ లీసా గిల్ నియామకం ద్వారా ఏపీ హైకోర్టు పరిపాలనలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
