ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ అంశంపై తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై చర్చను కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శుక్రవారం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం చర్చకు నిరాకరించడంతో వైసీపీ సభ్యులు సభలోనే నిరసనకు దిగారు.
వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, కేఆర్జే భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు లడ్డూ ప్రసాదంపై చర్చా నోటీసును చైర్మన్‌కు సమర్పించారు. నిన్న చర్చ ప్రారంభమైన తర్వాత అధికార పక్షం కావాలనే అడ్డుకుందని, ఇవాళ ఆ చర్చను కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూ నెయ్యి వివాదం వెనుక చంద్రబాబు వ్యాపార లబ్ధి ఉందని వైసీపీ ఆరోపించింది. హెరిటేజ్ మరియు ఇందాపూర్ డెయిరీలకు సంబంధించిన ఆధారాలను సభ ముందు ఉంచుతామని, అందుకే ప్రభుత్వం పలాయనం చిత్తగిస్తోందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి మరియు ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు సభలోనే బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, నిజానిజాలు ప్రజలకు తెలియకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు.
