గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు వద్ద జాతీయ రహదారిపై శనివారం భారీ ఆందోళన నెలకొంది. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో మృతుడి బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.
కొర్రపాడు గ్రామానికి చెందిన అనిల్ (24) శుక్రవారం గుంటూరు అరండల్‌పేటలో విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. మృతదేహానికి పంచనామా రిపోర్ట్ ఇచ్చేందుకు అరండల్‌పేట పోలీసులు రూ. 1.50 లక్షల నగదు డిమాండ్ చేశారని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని తమకు అప్పగించాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు
