కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీతో పాటు సెలబ్రిటీల సందడి కూడా నెలకొంది.
‘డకాయిట్’ సినిమా హీరో అడివి శేషు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల, అర్చన అయ్యర్ కూడా వేకువజామునే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ తమిళ నటి నీలిమ రాణి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ వెలుపల అభిమానులు వీరితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
