అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు గౌరవప్రదంగా, సరైన సమయానికి అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
పింఛన్ పంపిణీ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా పాల్గొని, పింఛన్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.ప్రభుత్వ పథకాలు రాజకీయ ప్రమేయం లేకుండా ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
