డెల్టా ప్రాంతమైన గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో సాగు కష్టాలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా పసుపు పంటపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రకృతి కన్నెర్ర చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ ఏడాది లాభాలు వస్తాయన్న ఆశతో పసుపు సాగు చేసిన రైతులకు వర్షాభావం శాపంగా మారింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంట ఎదుగుదల దెబ్బతిని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు విత్తనం కొనుగోలు దగ్గర నుండి నాట్లు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగిపోయాయి. పంట చేతికి వచ్చేసరికి పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదని రైతు వెంకటరెడ్డి వాపోయారు. అటు ప్రకృతి సహకరించక, ఇటు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక డెల్టా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి కొల్లిపర ప్రాంత పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతాంగం కోరుతోంది.పసుపుతో పాటు అరటి, మొక్కజొన్న సాగు చేసే రైతులు కూడా ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నారని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కోరుతున్నారు.
