పట్టణంలోని బి.సి. కాలనీ పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు భారీ ‘కార్డన్ అండ్ సెర్చ్’ (మెరుపు తనిఖీలు) నిర్వహించారు. డీఎస్పీ జనార్దనరావు నేతృత్వంలో టు-టౌన్ సీఐ రాములనాయక్, వన్-టౌన్ సీఐ మల్లిఖార్జునరావు మరియు ఎస్ఐలు పెద్ద సంఖ్యలో సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి, వారి వివరాలను సేకరించారు.తనిఖీల్లో సరైన పత్రాలు లేని 50 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ‘సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా యువత చెడు మార్గంలో వెళ్లకుండా, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని డీఎస్పీ అవగాహన కల్పించారు. కాలనీవాసులందరితో కలిసి “డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు” అంటూ ప్రతిజ్ఞ చేయించారు.నేరాల నియంత్రణే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని డీఎస్పీ కోరారు.
