ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధ్యాయుల సమయపాలనపై విద్యాశాఖ ఉక్కుపాదం మోపింది. ఇకపై టీచర్లు బడికి రావడం, వెళ్లడంపై ఎలక్ట్రానిక్ డివైజ్ (యాప్) ద్వారా నిరంతర నిఘా ఉండనుంది. నిబంధనలు అతిక్రమిస్తే జీతంలో కోత విధించేలా కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఉదయం 9 గంటల తర్వాత వస్తే ‘లేట్ ఇన్’గా పరిగణిస్తారు. నెలకు కేవలం రెండు రోజులు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్‌కు అనుమతి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3:30 గంటల కంటే ముందు, ఉన్నత పాఠశాలల్లో 4:00 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ‘అవుట్ టైమ్’ నమోదు చేసినా అది ‘ఎర్లీ అవుట్’గా పరిగణించబడుతుంది. ఉదయం ఇన్-టైమ్ వేసి, సాయంత్రం అవుట్-టైమ్ వేయకపోతే సదరు ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరైనట్లుగా భావించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. సెలవు కావాలంటే ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారానే అనుమతి తీసుకోవాలి. ఏ కారణంపై సెలవు పెడుతున్నారు, ఇప్పటివరకు ఎన్ని వాడారు అనే వివరాలు క్లుప్తంగా నమోదు చేయాలి. ఎక్కువ రోజులు సెలవు కావాలంటే పైఅధికారుల అనుమతి తప్పనిసరి. మధ్యాహ్నం సెలవు పెట్టేవారు 12:30 గంటల తర్వాతే వెళ్లాలి. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం వచ్చేవారు ఒంటి గంటలోపు రిపోర్ట్ చేయాలి.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
