ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ఆలయ వైదిక కమిటీ మరియు అధికారులు ఆహ్వానించారు.
ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, ప్రసాదాన్ని అందజేశారు.కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఈ క్రతువు జరగనుంది. మార్చి 8న ప్రధాన కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయ పునరుజ్జీవనం కోసం నిర్వహించే ఈ వేడుకకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. కంచి పీఠాధిపతి స్వయంగా తరలివచ్చి కుంభాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇంద్రకీలాద్రిపై యాగశాలలు, ఇతర మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
